Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) అఖిల భారత 17వ మహాసభలు మంగళవారం నుంచి హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఉస్మానియా వర్సిటీ (ఓయూ)లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల 16 వరకు మహాసభలను నిర్వహిస్తున్నారు. మల్లు స్వరాజ్యం నగ ర్, అభిమన్యు, ధీరజ్, అనీషాన్ ప్రాంగణంలో సభలు జరుగుతాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రసాద్ ఐమ్యాక్స్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు విద్యార్థి కవాతు, ప్రదర్శన ఉంటుంది. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను అధ్యక్షతన పీపుల్స్ ప్లాజాలో జరిగే బహిరంగ సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరవుతున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిస్వాస్, బాలికల జాతీయ కన్వీనర్ థీఫ్సీతాధర్ తదితరులు పాల్గొంటారు. సాయంత్రం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రతినిధుల సమావేశాలు ప్రారంభమవుతాయి.
29 రాష్ట్రాల నుంచి 750 మంది ప్రతినిధులతో పాటు క్యూబా, శ్రీలంక తదితర దేశాల నుంచి విద్యార్థి నాయకులు పాల్గొంటారు. మోడీ ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం, బీజేపీ ప్రభుత్వం తెస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయడం, మతోన్మాదం, విద్య ప్రైవేటీకరణ, విద్యార్థి ఎన్నికలపై నిషేధం తదితర అంశాలపై మహాసభల్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన నాయకులను ఆహ్వానించడంతో సీతారాం ఏచూరి, నీలోత్పల్ బసు వంటి నేతలు కూడా మహాసభలకు రానున్నారు. సభల ఏర్పాట్లను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం పరిశీలించారు.