Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గంజాయి సేవించి భార్యతో గొడవపడి. సహనం కోల్పోయిన భర్త, తన భార్య, ఐదుగురు పిల్లలను గొడ్డలితో అతి కిరాతకంగా నరికేశాడు. ఆ తర్వాత తాను ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాలో వెలుగు చూసింది.
తిరువణ్ణమలై జిల్లా పరిధిలోని ఒర్నత్తవాడి గ్రామానికి చెందిన పళనిసామి(45) వృత్తి రీత్యా రైతు. తనకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు భూమి కౌలుకు తీసుకొని సాగు చేసేవాడు. అయినప్పటికీ ఆశించినంత లాభం వచ్చేది కాదు. ఇక కరోనా కూడా ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అప్పులు మరింత ఎక్కువై పోయాయి. ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అప్పు పుట్టే పరిస్థితి లేదు. పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో పళనిసామి గంజాయికి బానిసగా మారాడు. ఇక నిన్న కూడా డ్రగ్స్ సేవించి ఇంటికి వచ్చిన పళనిసామి భార్యతో గొడవపడ్డాడు. దీంతో భార్యతో పాటు పిల్లలపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, కుమారుడు, ఇద్దరు అమ్మాయిలు చనిపోగా, 9 ఏండ్ల వయసున్న మరో అమ్మాయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.