Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మీ హిందీ బాగాలేదనే పద్ధతిలో రేవంత్ రెడ్డిని నిండు సభలో నిర్మలా సీతారామన్ అవహేళన చేస్తూ మాట్లాడడం అహంకారానికి నిదర్శనమన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. పార్లమెంట్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హిందీ భాష మాట్లాడిన తీరును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండించారు కూనంనేని సాంబశివరావు. ఒక గౌరవ సభ్యుని పట్ల అనుచితంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. సభ కస్టోడియన్‌గా సభ్యుల హక్కులు మర్యాదను కాపాడాల్సిన లోక్‌సభ స్పీకర్ సైతం రేవంత్ రెడ్డి రక్షణకు రాకపోగా నిర్మలా సీతారామన్‌ను సమర్ధించే విధంగా వ్యవహరించడం దారుణమన్నారు కూనంనేని సాంబశివరావు. దక్షిణాది ఎంపీలు సభలో మాట్లాడేటప్పుడు బడి పిల్లలను గదమాయించే హెడ్‌మాస్టర్ తరహాలో లోక్‌సభ స్పీకర్ వ్యవహరించడాన్ని తప్పుబట్టారు.
రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో పేరొన్న 22 భాషల్లో పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి హిందీలో మాట్లాడడాన్ని ప్రోత్సహించకుండా హేళన చేయడం సమర్థనీయం కాదన్నారు. అయినా రేవంత్ రెడ్డి తన భావాన్ని హిందీలో అర్థమయ్యే రీతిలోనే స్పష్టంగా వ్యక్తీకరించారని, ఆయన లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కించపరిచేలా మాట్లాడారన్నారు. ఆమె తక్షణమే తన వ్యాఖ్యలను వెనకి తీసుకొని విచారం వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు లోక్‌సభ స్పీకర్ సైతం సభ్యుల వ్యక్తీకరణలో ఇబ్బందులు ఉంటే సారాంశాన్ని గ్రహించేందుకు సహకరించాలే తప్ప అనుచితంగా వ్యవహరించకూడదన్నారు కూనంనేని సాంబశివరావు.