Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గురువారం కనిపించకుండా పోయిన చిన్నారి శుక్రవారం చెరువులో శవమై తేలింది. దమ్మాయిగూడ చెరువులో పాప మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు డెడ్ బాడీని వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం తరలించారు. పాప డెడ్ బాడీని తమకు చూపించకుండానే తరలించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా స్థానికులు కూడా దమ్మాయిగూడ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.
చిన్నారిపై అఘాయిత్యం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప కనిపించడం లేదంటూ గురువారమే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థిని గురువారం నుంచి కనిపించకుండా పోయింది. ఎప్పట్లానే గురువారం ఉదయం దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో దించి వెళ్లానని పాప తండ్రి చెప్పారు. మధ్యాహ్నం సమయానికి పాప లేదంటూ స్కూలు నుంచి ఫోన్ వచ్చిందని అన్నారు. పాప బుక్స్, బ్యాగ్ క్లాసులోనే ఉన్నాయి కానీ పాప లేదని టీచర్ చెప్పారన్నారు.
దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని పాప తండ్రి తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి, బాలిక ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించినట్లు పోలీసులు తెలిపారు. స్కూల్ ఏరియాలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండడం కనిపించిందని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలతో పాప దమ్మాయిగూడ చెరువు వైపు వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో శుక్రవారం చెరువులో వెతికించగా చిన్నారి మృతదేహం బయటపడింది. మృతదేహాన్నిపోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, డెడ్ బాడీని తమకు చూపించకపోవడంపై పాప తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాప కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేసినా పోలీసులు వెంటనే స్పందించలేదని ఆరోపిస్తున్నారు.