Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్సిటీల్లో ప్రగతిశీల సంస్కృతి పెరగాలి
- ఎస్ ఎఫ్ ఐ జాతీయ సహాయ కార్యదర్శి నితీష్ నారాయణ
నవతెలంగాణ-హైదరాబాద్
విద్యారంగ పరిరక్షణకు విశాల ప్రాతిపదికన అభ్యుదయ ప్రగతి కనుక విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తామని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి నితీష్ నారాయణ అన్నారు. క్షేత్ర స్థాయి ఉద్యమాలతోనే కలయిక సాధ్యమని ఎస్ఎఫ్ఐ భావిస్తోందని చెప్పారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల చివరి రోజు శుక్రవారం ఆయన మహాసభల మీడియా పాయింట్ లో విలేకరులతో మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానానికి ప్రత్యామ్నాయ విద్యా విధానం ముసాయిదా పై మహాసభల్లో చర్చినట్లు తెలిపారు. విద్యారంగ బాధ్యులందరితో దీనిపై చర్చించి అన్ని రాష్ట్రాలకు, కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. ప్రతిభకు ఒక భాషను ప్రాతిపదికగా తీసుకోరాదని, దేశమంతా ఒకే పరీక్షా విధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. వృత్తి విద్యా కోర్సుల బోధన కూడా మాతృ భాషలో జరగాలన్నారు. కరోనా సమయంలో విద్యార్థుల్లో డ్రగ్ సంస్కృతి బాగా పెరిగిందని విద్యాలయాల్లో ప్రధాన సమస్యగా మారిందని చెప్పారు. వయనాడ్ లో డ్రగ్ మాఫియా ఎస్ ఎఫ్ ఐ సెక్రెటరీ పై కూడా దాడి చేసిందన్నారు.
ఈ సమస్యపై మహాసభల్లో సీరియస్ గా చర్చించామని, కళాశాలల్లో ప్రోగ్రెసివ్ కల్చర్ ఇంకా పెరగాలని ఆకాంక్షించారు. తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రజాస్వామ్య వాతావరణం లేదని, విద్యార్థులు ద్వితీయ శ్రేణి పౌరులు కాదని నితీష్ హెచ్చరించారు. దేశంలో ఉన్నత విద్యా శాతం చాలా తక్కువగా నమోదవుతుంది అని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అక్కడ ఇంటర్ నెట్ సౌకర్యం కూడా లేదన్నారు. సంఘ్ పరివార్ పొలిటికల్ ఏజెంట్లుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్లు సమస్యల సృష్టికర్తలు గా మారారని విమర్శించారు. వికలాంగ విద్యార్థుల పక్షాన పోరాడతామని చెప్పారు.
ఈ మహాసభల్లో 23 రాష్ట్రాలకు చెందిన 697 ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. విద్యారంగానికి సంబంధించిన 35 తీర్మానాలను సభ ఆమోదించింది. డేలిగెట్లల్లో సిద్దిపేటకు చెందిన 16 ఏళ్ల విద్యార్ధిని హారిక పిన్న వయస్కురాలుగా హాజరయ్యారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు మూర్తి, నాగరాజు, ఆహ్వాన సంఘం కోశాధికారి జావేద్, ప్రతినిధులు షేజిన, నిలంజన్ దత్త తదితరులు పాల్గొన్నారు.