Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పురుషుల విభాగంలో ఈ ఏడాది ఐటీఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌గా రఫెల్ నాదల్ ఎంపికయ్యాడు. పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియటెక్ మహిళా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది టెన్నిస్ టోర్నమెంట్లలో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు వీళ్లిద్దరినీ ఐటీఎఫ్ వరల్డ్ ఛాంపియన్లుగా ఎంపిక చేస్తూ అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.
నాదల్ తన కెరీర్‌లో ఈ గౌరవం పొందడం ఐదోసారి. దాంతో అతను మాజీ ఆటగాడు రోజర్ ఫెదరర్‌తో సమానంగా నిలిచాడు. నొవాక్ జకోవిక్ అత్యధికంగా 7 సార్లు ఐటీఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు. మాజీ ప్లేయర్ పీట్ సాంప్రాస్ ఆరు సార్లు ఈ గౌరవం అందుకున్నాడు. ఈ ఏడాది నాదల్ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) గెలిచాడు. దాంతో ప్రస్తుతం అతని ఖాతాలో 22 గ్రాండ్‌స్లామ్స్ ఉండడం ప్రత్యేకత. స్వియటెక ఈ సంవత్సరంలో 8 టైటిళ్లు నెగ్గింది. వీటిలో యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఏడాది ఆమె 65 మ్యాచ్‌లు గెలవడం విశేషం.