Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం త్వరలో విద్యాసంస్థల్లో అమ్మాయిల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురానుందని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. ఓయూ ఠాగూర్ స్టేడియంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సు జరిగింది. కార్యక్రమంలో సీపీ సీవీ ఆనంద్, ఓయూ వీసీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిలపై అఘాయిత్యాల నివారణకు ప్రత్యేక చట్టం తేనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ప్రత్యేక చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు. డీవీఏ స్కూల్‌లో జరిగిన ఘటన తర్వాత చట్టంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే స్కూల్స్, కాలేజీల్లో చిన్నారులు, యువతులపై అఘాయిత్యాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
యాంటీ డ్రగ్స్ కమిటీల మాదిరిగానే ఈ చట్టం పని చేస్తుందన్నారు. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగిస్తున్న వారి సంఖ్య 11కోట్లుగా ఉందని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు సైతం మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. దశాబ్ద క్రితం ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కళాశాలల్లో కమిటీలు వేశామని, కమిటీలతో ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం మాదక ద్రవ్యాలను నిరోధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీల్లో విద్యార్థులను చేర్చాలన్నారు. గోవా డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, గోవాలో ఉండి హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.