Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్:
ఒడిశాలోని బలాన్‌గిర్ జిల్లా అగల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్పోర్ట్స్ మీట్ లో భాగంగా ఓ విద్యార్థి విసిరిన జావెలిన్ 9వ తరగతి విద్యార్థి సదానంద మెహర్ మెడలో దిగబడింది. జావెలిన్ మొన భాగం మెడ ఎడమవైపు నుంచి కుడివైపుకు పోడుచుకొచ్చింది. తక్షణమే ఉపాధ్యాయులు బాధిత విద్యార్థిని బలాన్‌గిరి భీమాభోయ్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేసి జావెలిన్‌ను బయటకి తీసిన వైద్యులు విద్యార్థికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఘటనతో పాఠశాలలో స్పోర్ట్స్ మీట్‌ని రద్దు చేశారు.
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. విద్యార్థి అవసరమైన వైద్యాన్ని అందించాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. ‘‘ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్‌లో ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి మెడలో జావెలిన్ గుచ్చుకుంది. అయితే, బాధిత విద్యార్థికి ప్రాణాపాయం తప్పింది’’ అని జిల్లా కలెక్టర్ చంచల్ రాణా ఓ ప్రకటన విడుదల చేశారు. తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి రూ.30వేల ఆర్థిక సాయం అందించినట్టు కలెక్టర్ తెలిపారు. విషయం తెలుసుకున్న బాలుడి బంధువులు, కుటుంబీకులు ఆస్పత్రి వద్ద గుమిగూడారు.