Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో గ్యాస్ హీటర్ కారణంగా ఊపిరాడక భార్యాభర్తలు మృతిచెందారు. వారి నాలుగు నెలల చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. అక్రోలి గ్రామానికి చెందిన సల్మాన్ స్థానికంగా మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. తన భార్య, నాలుగు నెలల చిన్నారితో అదే ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే శనివారం ఉదయం పది గంటల వరకు నిద్రలేవకపోవడం వల్ల కింద ఇంటిలో ఉన్న బంధువులకు అనుమానం వచ్చింది. పైకి వెళ్లి చూసేసరికి లోపల తాళం వేసి ఉంది. తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లి చూడగా.. సల్మాన్ దంపతులు, చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. గ్యాస్ హీటర్ కూడా పూర్తిగా కాలిపోయి కనిపించింది. బంధువులు.. సల్మాన్ దంపతులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారిని మరో ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.