Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కడప జిల్లా వేంపల్లి స్థానిక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం, నకిలీ లేబుళ్లు అతికించి మద్యం విక్రయిస్తున్న వారిపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. అయిదుగురు పొరుగుసేవల సిబ్బంది, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. చిత్తూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్‌శాఖ అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి ఆధ్వర్యంలో పులివెందుల రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో దాడులు నిర్వహించారు. మంచినీరు కలిపిన 18 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పొరుగుసేవల సిబ్బంది బ్రహ్మయ్య, కేశవను అరెస్టు చేశారు. మరో ప్రభుత్వ మద్యం దుకాణంలో దాడులు నిర్వహించి రూ.130కి బదులు రూ.150 ధరగా ముద్రించిన నకిలీ లేబుల్‌ను అతికించిన మద్యం సీసాలను, 560 నకిలీ లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. పొరుగుసేవల సిబ్బంది వందిత్‌కుమార్, రోఫా, శ్రీకాంత్, లేబుళ్లు సరఫరా చేసిన కడప వాసి రమణను అరెస్టు చేశారు. వీరిని శనివారం పులివెందుల కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారని ప్రొద్దుటూరు ఎక్సైజ్ సీఐలు సురేంద్రారెడ్డి, వీరారెడ్డి తెలిపారు.