Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తనపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ లీడర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మండిపడ్డారు. అంతకుముందు చెప్పినట్లే ఆదివారం ఉదయం పది గంటలకు హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయానికి పైలట్ రోహిత్ రెడ్డి చేరుకున్నారు. అమ్మవారికి పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ తనపై చేస్తున్న ఆరోపణలను భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని చేస్తున్న ఆరోపణలు నిజమేనని బండి సంజయ్ నమ్మితే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. తన సవాల్ ను బండి సంజయ్ స్వీకరించకుండా కొట్టిపారేయడంతో ఆయన ఆరోపణలు అబద్ధమని తెలంగాణ ప్రజలకు అర్థమైందని చెప్పారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతోనే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ నేతలకు అబద్ధాలు చెప్పడం వెన్నెతో పెట్టిన విద్య అని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు, వ్యాపారస్థులను బీజేపీ టార్గెట్ చేస్తోందని చెప్పారు.
ఈ సందర్బంగా తనపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపైనా రోహిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు రోహిత్ రెడ్డి గుప్పించారు. తాను బండి సంజయ్ కు సవాల్ చేస్తే ఆయన తరఫున రఘునందన్ రావు వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పటాన్ చెరులో వ్యాపారస్థుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డ చరిత్ర రఘునందన్ రావుదని రోహిత్ రెడ్డి మండిపడ్డారు. కోర్టులో తనకు న్యాయం చేయాలని వచ్చిన మహిళకు మత్తుమందిచ్చి అఘాయిత్యం చేశారని రఘునందన్ రావుపై ఆరోపణలు గుప్పించారు. నారియట్ హోటల్ లో ఒక రూమ్ ను సంవత్సరాల తరబడి అద్దెకు తీసుకునేంత డబ్బు రఘునందన్ రావుకు ఎక్కడి నుంచి వచ్చిందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకప్పుడు స్ట్రింగర్ గా ఉన్న రఘునందన్ రావు ఇప్పుడు వందల కోట్లకు ఎలా పడగలెత్తారని రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువైన విల్లాలో ఉంటూ, ఖరీదైన కార్లలో తిరిగేంత డబ్బు ఎలా సంపాదించారని అడిగారు.