Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచిర్యాల: మందమర్రి పట్టణం, రామకృష్ణాపూర్‌లో అర్ధరాత్రి ఓ ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ఆరుగురు సజీవ దహనమైన సంఘటన చోటుచేసుకుంది. మృతుల్లో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు సహా అందరూ గుర్తుపట్టలేనంతగా కాలిపోవడం విషాదం. సింగరేణి ఉద్యోగి వివాహేతర సంబంధం కారణంగా ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న గొడవలు, ఆస్తి వివాదాల తరుణంలో ప్రణాళిక ప్రకారం ఆయన భార్య, తన ప్రియుడి సాయంతో ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తేలింది.
ఘటన జరిగిన ఇంటి వెనుకవైపున టైర్లు సగం కాలిన స్థితిలో ఉన్నాయి. వాటికి కొద్ది దూరంలోనే 20 లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు పెట్రోలు డబ్బాలు ఉన్నాయి. దీన్నిబట్టి నిందితులు ఇంటి తలుపు సందుల్లోంచి పెట్రోల్ పోసి నిప్పంటించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంటలు చుట్టుముడుతున్నా ఇంట్లోంచి అరుపులు వినిపించలేదని స్థానికులు చెప్పడాన్ని బట్టి ఆరుగురూ మత్తులో ఉండే అవకాశాలున్నాయి. ఆ ప్రకారం చూస్తే ప్రణాళిక ప్రకారం మత్తు ఇచ్చి ఉండటమో లేదా ముందుగానే చంపేసి తర్వాత తగలబెట్టడమో చేసి ఉంటారనే అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తుంది.