Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భాగ్యనగరం నూతన సంవత్సర వేడుకలకు సిద్ధం అవుతోంది. ఈ సారి మరింత ఘనంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నగరవాసులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రత్యేకంగా వేడుకలకోసం నిర్వాహకులు, యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే, నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు హైదరాబాద్ పోలీసులు నిబంధలను విధించారు. వేడుకలను రాత్రి ఒంటిగంట వరకూ నిర్వహించుకునేందుకు 3 నక్షత్ర, అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వహకులు, యాజమాన్యాలు 10 రోజుల ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు. వేడుకలు నిర్వహించే ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాల్లోనూ సీసీ కెమెరాలు అమర్చాలని, ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని సూచించారు. అసభ్యకర నృత్యాలు, అల్లర్లు జరగకుండా చూడాలని.. వేడుకల ప్రాంగణంలో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని ఆదేశించారు. మారణాయుధాలను వేడుకల ప్రాంతాల్లోకి అనుమతించకూడదని, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని సూచించారు. నిర్దిష్ట పరిమితికి మించి టికెట్లు, పాసులు జారీ చేస్తే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. నిర్వహకులు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని.. సాధారణ ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదని పేర్కొన్నారు. జంటల కోసం పబ్బులు, బార్లలో నిర్వహించే వేడకలకు మైనర్లను అనుమతించకూడదన్నారు. వేడుకల్లో మాదక ద్రవ్యాలు సరఫరా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని తెలిపారు. ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయం దాటిన తర్వాత మద్యం సరఫరా చేయకూడదని.. వేడుకల తర్వాత మద్యం సేవించిన వారు వాహనం నడపకూడదని, వారు ఇంటికి చేరేలా చూసే బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు.