Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు సర్వే పనులు ఐటీ కారిడార్‌లోని రాయదుర్గంలో మొదలయ్యాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెండు ఇంజినీరింగ్ బృందాలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. మొదట రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ మీదుగా ఐకియా, అరబిందో గెలాక్సీ ప్రాంతాల నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, నార్సింగి వరకు 10 కిలోమీటర్ల మార్గాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా అలైన్‌మెంట్ ఖరారు, గ్రౌండ్ డాటా సేకరణ పనులు చేసేందుకు రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, మెట్రో స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత వుండాలనే విషయంలో ఈ డాటా కీలకమవుతుందని తెలిపారు. ఈ కారిడార్ కేవలం విమానాశ్రయ ప్రయాణికులకే కాకుండా ఈ ప్రాంతవాసులకు, ముఖ్యంగా నగర శివార్లలో నివాసముండే తకువ ఆదాయ వర్గాల వారందరికీ కూడా ఉపయోగపడేలా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు ఎండీ వివరించారు. సర్వే బృందంలో హెచ్‌ఏఎంఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బీ ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్లు ఎం విష్ణువర్ధన్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ నాయక్, ఇతర సీనియర్ ఇంజినీర్లు పాల్గొన్నారు.