Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: విజ్ఞాన యాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రం మణిపుర్ లోని నోనీ జిల్లాలో బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నోనీ జిల్లాకు చెందిన థంబాల్ను స్కూల్ విద్యార్థులు రెండు బస్సుల్లో స్టడీ టూర్‌కు వెళ్లారు. మార్గమధ్యంలో లాంగ్‌సాయ్ ప్రాంతంలో అమ్మాయిలు ప్రయాణిస్తోన్న బస్సు ప్రమాదానికి గురైంది. మలుపులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు బోల్తా పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 15 మంది విద్యార్థినులు మృతిచెందినట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే మరణాలపై అధికారిక సమాచారం లేదు. మరోవైపు ఘటనలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సదరు కథనాలు చెబుతున్నాయి.
ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ట్విటర్‌లో షేర్ చేసిన ఆయన.. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.