Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ దేశం గర్వించేలా చేయనుంది. ఈ చిత్రం ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డులకు షార్ట్ లిస్ట్ అయింది. ఈ చిత్రంతో పాటు 'ద లాస్ట్ ఫిల్మ్ షో' అనే సినిమా కూడా 2023 ఆస్కార్స్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుత స్టెప్పులతో అలరించిన నాటు నాటు పాట అస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. ఈ ఘనత సాధించిన భారత చలన చిత్ర తొలి పాటగా ఇది రికార్డు సృష్టించింది. ఇక, అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ద లాస్ట్ ఫిల్మ్ షో షార్ట్ లిస్ట్ అయింది. పాటల కేటగిరీలో మొత్తం 81 పాటలు బరిలో నిలవగా.. వడబోత తర్వాత నాటు నాటు సహా 15 పాటలు మాత్రమే షార్ట్ లిస్ట్ లోకి వచ్చాయి. ఇందులో అవతార్2లోని నథింగ్ యిస్ లాస్ట్ పాట కూడా ఉంది. ఆస్కార్ అవార్డులు అందించే ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 2023కి గాను ఆస్కార్ కోసం పోటీ పడుతున్న పది కేటగిరీల్లో షార్ట్ లిస్ట్ అయిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. నామినేషన్ల ఓటింగ్ జనవరి 12-17 వరకు కొనసాగుతుంది. జనవరి 24న నామినేషన్లను ప్రకటిస్తారు. 95వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానం మార్చి 12న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతుంది.