Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ శామ్ కరన్ నిలిచాడు. నేటి ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఈ ఎడమచేతివాటం ఆటగాడికి ఏకంగా రూ.18.50 కోట్ల భారీ ధర లభించడం విశేషం. శామ్ కరన్ ను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా వేలం పాటను పెంచేశాయి. అతడి కనీస ధర రూ.2 కోట్లు కాగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి రూ.18.50 కోట్లతో శామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ చేజిక్కించుకుంది.
2008లో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక, అప్పటినుంచి మరే ఆటగాడికీ ఇంత ధర లభించక పోవడం గమనించదగ్గ విషయం. అంతే కాకుండా ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ సైతం ఇవాళ్టి వేలంలో సంచలనం సృష్టించాడు. గ్రీన్ కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటాపోటీగా వేలం పాటలో పాల్గొన్నాయి. కామెరాన్ గ్రీన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, అతడిని ముంబయి ఇండియన్స్ రూ.17.50 కోట్లతో కొనుగోతొలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర కావడం విశేషం. ఇంగ్లాండ్ సీనియర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సైతం కోట్లు కొల్లగొట్టాడు. ఈసారి వేలంలో నిలిచిన స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.16.25 కోట్లకు దక్కించుకుంది.