Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ప్రధాని మోడీ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలతో పేదవాళ్లు మరింత పేదలుగా.. ధనికులు మరింత ధనవంతులుగా మారుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. టీపీసీసీలో సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన డీగ్గీ.. అసంతృప్త నేతలతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. అసంతృప్తికి గల కారణాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆయన వారితో చర్చించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దిగ్విజయ్ మాట్లాడుతూ... రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రను రాష్ట్రంలో విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘కేవలం ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమయ్యేదా? కాంగ్రెస్ లేకుండా రాష్ట్రం ఏర్పడేది కాదు. 2004లో మాట ఇచ్చి 2014లో దాన్ని నిలబెట్టుకున్నాం. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. కేసీఆర్‌కు బలం లేక కాంగ్రెస్ నాయకులను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలన్నింటికీ టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. కుటుంబ పాలన, అవినీతిలో కేసీఆర్ ప్రభుత్వం మునిగింది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు విశేష స్పందన వస్తోంటే.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి భారత్ జోడో యాత్రను ఎందుకు ఆపమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం మెడికల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిందా? లాక్‌డౌన్ పెడుతోందా?’’ అని దిగ్విజయ్ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం, ధరలు బాగా పెరిగాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పైనా ఆయన విమర్శలు చేశారు.