Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: 2018లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంబ్రిడ్జి అనలిటికాకు యూజర్ల డేటాను అక్రమంగా విక్రయించిందన్న వివాదానికి ముగింపు పలికేందుకు ఫేస్‌బుక్ సిద్ధమైంది. ఈ కేసును పరిష్కరించుకునేందుకు 725 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6,000 కోట్లు) చెల్లించేందుకు మాతృసంస్థ మెటా ముందుకు వచ్చింది. అయితే అందుకు ఆ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ప్రపంచంలో సమాచార గోప్యత నిబంధనల ఉల్లంఘనల కింద చెల్లించిన అత్యధిక జరిమానాగా ఇది నిలుస్తుంది. అంతేకాదు ఓ ప్రయివేటు ఫిర్యాదును పరిష్కరించుకునేందుకు ఫేస్‌బుక్ చెల్లించిన అతిపెద్ద మొత్తం కూడా ఇదే.
యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సంరక్షించడంలో ఫేస్‌బుక్ విఫలమైందని ఈ కేసులో యూజర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సంస్థ అంతర్గత సమాచారాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసి దానికి సంబంధించిన ఆధారాలను వారు సంపాదించారు. దీంతో మెటా వివాదానికి ముగింపు పలకడానికి సిద్ధమైంది. ఒకవేళ విచారణ కోసం పట్టుబట్టి.. కేసులో ఓడిపోయి ఉంటే మెటా ఇంకా భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వచ్చేది. ఈ ముప్పును పసిగట్టి మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని సంస్థ ముందే జాగ్రత్త పడింది. యూజర్లు, వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా వెల్లడించింది. మరోవైపు యూజర్ల డేటా రక్షణకు సంబంధించిన విధానాల్ని సమీక్షించినట్టు కూడా పేర్కొంది. అలాగే తాము ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నామో యూజర్లకు స్పష్టంగా చెబుతున్నట్టు తెలిపింది.
అసలు వివాదం ఇది
గ్లోబల్ సైన్స్ రీసెర్చి 2014లో ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ అనే యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిశోధన, విద్యా సంబంధిత అవసరాల కోసం తన వినియోగదారుల సమాచారాన్ని సేకరించేందుకునేందుకు గ్లోబల్ రీసెర్చికి ఫేస్‌బుక్ అనుమతినిచ్చింది. తర్వాత ఈ డేటాను వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకునేందుకు గ్లోబల్ రీసెర్చితో కేంబ్రిడ్జి అనలిటికా ఒప్పందం కుదుర్చుకుంది.
ఇలా అక్రమంగా కేంబ్రిడ్జి అనలిటికా చేతుల్లోకి సమాచారం వెళ్లిన విషయం తొలిసారి 2018లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.. ప్రపంచవ్యాప్తంగా 87 మిలియన్ల మంది యూజర్ల సమాచారం అక్రమంగా కేంబ్రిడ్జి అనలిటికా చేతుల్లోకి వెళ్లి ఉండొచ్చని అంగీకరించారు. ఈ ఉదంతం 2018లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికాతో పాటు అనేక దేశాల ఎన్నికలను కేంబ్రిడ్జి అనలిటికా ప్రభావితం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా పనిచేసినట్లు సైతం ఆరోపణలు వచ్చాయి.
ఈ అక్రమాలను తొలిసారి వెలుగులోకి తీసుకువచ్చిన క్రిస్టోఫర్ విలీ 'ఇది పూర్తిగా వ్యక్తుల గోప్యతా నిబంధనల్ని ఉల్లంఘించడమే`నని తెలిపారు. అలాగే, ఈ డేటాను ఓటర్లను ప్రభావితం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని జొప్పించేందుకు వినియోగిస్తున్నారని వెల్లడించారు. భారతదేశంలోనూ పలు పార్టీలు తమ సేవలను ఉపయోగించుకున్నాయని కేంబ్రిడ్జి అనలిటికా గతంలోనే తెలిపింది. దీన్ని ఆధారంగా చేసుకొని కేంద్ర ఐటీ శాఖ.. ఫేస్‌బుక్, కేంబ్రిడ్జి అనలిటికాకు నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు నిజమేనని ప్రాథమిక విచారణలో తేలడంతో కేసు కూడా నమోదు చేసింది.