Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: స్వభాషను రక్షించుకుందాం స్వాభిమానం పెంచుకుందాం నినాదంతో విజయవాడ సిద్ధార్థ అకాడమీలో ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభలను వెంకయ్యనాయుడు, కృష్ణా రచయితల సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక, సిలికానాంధ్ర, సిద్దార్ధ అకాడమీ ప్రతినిధులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రాజరాజనరేంద్ర సభా ప్రాంగణంలో ఆదికవి నన్నయ్య వేదికపై మహాసభలు నిర్వహిస్తున్నారు. పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ పేరిట మరో రెండు వేదికలను కూడా అనుబంధ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రచనల ద్వారానే భాషా సంస్కృతులు ముందు తరాలకు చేరుతాయని అన్నారు. దేశ వైభవాన్ని ఆ దేశంలో పుట్టిన సాహిత్యం ప్రతిబింబిస్తుందన్నారు. తెలుగు భాష ఎంతో ప్రాచీనమైందని, పుష్కలమైన సాహిత్య, భాషా సంపద కలిగిన తెలుగులో 11వ శతాబ్దం నుంచే కావ్యరచన ప్రారంభమై, శాఖోపశాఖలుగా విస్తరించిందన్నారు.
భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలని తెలుగు భాషాభిమానులు ఆకాంక్షించారు. మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో భాష కూడా అంతేనని గుర్తుచేశారు. మన సామెతలు ఎన్నో జీవిత సత్యాలు నేర్పుతాయని వేమన, సుమతి శతకాలు నాణ్యమైన జీవితాన్ని ఎలా జీవించాలో తెలియజేస్తాయన్నారు. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య లాంటి మహనీయుల కీర్తనలు ఆధ్యాత్మికతలోని అసలు అర్థాన్ని వివరిస్తాయన్నారు. ఇంత ఘనమైన సాహితీ సంపద ఉన్న తెలుగు భాషను పరిరక్షించి ముందు తరాలకు అందజేసినప్పుడే మన సంస్కృతి, సంప్రదాయాలు మనుగడ సాగిస్తాయన్నారు.