Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ పాట్నా: బీహార్‌లో ఘోరం ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చంపారణ్ జిల్లాలోని నారీగిర్ గ్రామంలో ఓ ఇటుక బట్టీకి చెందిన ఎత్తయిన చిమ్నీ పేలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇటుక బట్టీ యజమానితో సహా 9 మంది కార్మికులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే.. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. గాయపడిన ఇతరులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
పేలుడు ధాటికి.. తీవ్ర గాయాలు, ఊపిరాడని పరిస్థితుల్లో కార్మికులు మృతి చెందారని అధికారులు తెలిపారు. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తదితరులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని సీఎం నీతీశ్ కుమార్ ట్విటర్ వేదికగా అధికారులను ఆదేశించారు.