Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హిందీ చలన చిత్ర పరిశ్రమలో యువనటి తునిషా శర్మ ఆత్మహత్య కేసులో సహనటుడు షీజన్ మహమ్మద్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరింపించినట్లు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కొన్నాళ్ల క్రితం వరకు వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉండగా.. ఇటీవలే బ్రేకప్ అయ్యింది. దీంతో నిన్న ‘అలీబాబా: దాస్తాన్ ఈ కాబుల్’ షూటింగ్ సెట్‌లో షీజన్ మేకప్ రూమ్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తునిషా తల్లి షీజన్‌పై ఆరోపణలు చేశారు. ఆత్మహత్య చోటు చేసుకొన్న సమయంలో సెట్‌లో ఉన్న సిబ్బందిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసును హత్య, ఆత్మహత్య అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ చంద్రకాంత్ జాదవ్ పేర్కొన్నారు. ఘటనా స్థలంలో తమకు ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదని వెల్లడించారు. షీజన్‌ను రేపు వసాయి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన తునిషా పలు చిత్రాల్లో కూడా నటించింది. కత్రినా కైఫ్, విద్యాబాలన్ వంటి స్టార్లతో కలిసి పనిచేసింది. ‘భారత్ కా వీర్ పుత్ర’ అనే సీరియల్‌తో 13 ఏళ్లకే నటిగా మారిన తునిషా ‘చక్రవర్తి అశోక సామ్రాట్’, ‘గబ్బర్ పూన్చావాలా’, ‘ఇంటర్నెట్ వాలాలవ్’, ‘హీరో: గాయబ్ మోడ్ ఆన్’ తదితర ధారావాహికల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. వెండితెరపైనా సందడి చేసింది. ‘ఫితూర్’ సినిమాలో కథానాయిక కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్ర పోషించింది.