Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్
మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలి అని ఐద్వారాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా వర్క్ షాప్ ఆదివారం నిజామాబాద్ ఐద్వా కార్యాలయంలో జరిగింది. వర్క్ షాప్ ను ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళల మీద దాడులు, హత్యలు, లైంగికదాడు పెరుగుతున్నాయని అన్నారు. దీనికి కారణం ఈ పార్టీ పెద్దలు మహిళల వస్త్రధారణ మీద, ఒంటరిగా వివిధ వృత్తులు చేసుకోవడాన్ని తప్పుపడుతూ మాట్లాడుతున్నారని దీన్నికొందరు దుండగులు ఆసరాగా తీసుకుని మహిళల్ని హింసిస్తున్నారని ఆమె అన్నారు. బీజేపీ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తూ మహిళలను వంటింటికే పరిమితం కావాలని మహిళల స్వేచ్ఛ స్వతంత్రాలపై అనేక ఆంక్షలు విధించడం బీజేపీ దుర్భుద్ధికి నిదర్శనమని తెలిపారు. సమాజంలో సగ భాగమైన మహిళలకు విధాన నిర్ణయాల్లో భాగం కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆమె విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర పాలకులు మద్యాన్ని ఆదాయవనరుగా భావిస్తూ రాష్ట్రంలో దేశంలో మత్తుపదార్థాలైన గుడుంబా గంజాయి ప్రోత్సహిస్తున్నారని యువకులకు అందుబాటులో ఉంచుతున్నారని వీటి వలన మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం గంజాయి మత్తుపదార్థాల నివారణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల పట్ల వివక్ష చులకన భావాలతో మహిళలపై హింస, ఆకృత్యాలు పెరుగుతున్నాయని, సినిమాల్లోనూ, టీవీ ఛానల్ లోనూ, మహిళలను కించపరిచే డైలాగులు, అశ్లీల దృశ్యాలు, స్త్రీలపై వివక్షను మరింత పెంచుతున్నాయని ఆమె విమర్శించారు. అన్ని పనుల్లో శ్రమ దోపిడీకి గురవుతున్నది మహిళలే అని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వమే నిర్ణయించాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బని లత మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్, అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలను పెంచి మహిళపై భారాలను మోపిందని అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. పెరిగిన ధరలతో సరైన ఆహరం తినలేక మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఆమె తెలిపారు. జీవనం కోసం కూలి పని చేసుకుంటున్న మహిళలు ఎక్కువ మంది ఉన్నారని వీరందరికీ కేరళ తరహాలో రేషన్ దుకాణాలు ద్వారా 16 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని, విద్య, వైద్యం, కేరళ తరహాలోనే తెలంగాణలో కూడా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సుజాత, జిల్లా ఉపాధ్యక్షురాలు గీతాంజలి, లక్ష్మీ ప్రసన్న, అనిత, పద్మ, నగర అధ్యక్షురాలు లావణ్య, నాయకులు వర్షా తదితరులు పాల్గొన్నారు.