Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: నేపాల్‌లో రాజకీయాలు రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆరు పార్టీల కూటమి నేతృత్వంలో ప్రచండ ప్రధాని కావాలనున్నారు. రెండున్నరేండ్ల పాటు అధికారాన్ని పంచుకునేందుకు ప్రచండ పార్టీ తెచ్చిన ప్రతిపాదనను సీపీఎన్ వ్యతిరేకిస్తుండటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తున్నది. ప్రచండ ప్రతిపాదనను కూటమిలోని కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. అయితే తామే ముందుగా అధికారం చేపడతామని సీపీఎన్ ఒత్తిడి తీసుకువస్తున్నది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఆదివారం కల్లా ఓ నిర్ణయం తీసుకోవాలని నేపాల్ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ అన్ని పార్టీలని కోరారు.
అధికార పీఠం కోసం ఆరు పార్టీల కూటమిలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. తాము ముందంటే తామంటూ ప్రచండ పార్టీ, సీపీఎన్ పార్టీ పట్టుబట్టడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. రెండున్నరేండ్ల చొప్పున అధికారాన్ని పంచుకునేందుకు ప్రచండ పార్టీ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. తమ పార్టీ తరఫున ప్రచండ ప్రధాని అవుతారని కూడా ఆయన పార్టీ ప్రకంటించింది. అయితే ప్రచండ పార్టీ ప్రతిపాదనను సీపీఎన్ పార్టీ పక్కన పెట్టింది. ముందుగా తామే అధికారం చేపడతామంటూ కొర్రీ పెట్టింది. ప్రచండ ప్రతిపాదన భేషుగ్గానే ఉందని మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయితే, ముందుగా రెండున్నరేండ్లు అధికారంలో ఉన్న తర్వాత ఏదో ఒక సాకు చూపి తన మద్దతును ఉపసంహరించుకుంటే ఎలా అని నేపాలీ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. నేపాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నేపాల్ కాంగ్రెస్-సీపీఎన్ మావోయిస్టులు సిద్ధమయ్యాయి. తొలుత రెండున్నరేండ్ల పాటు ప్రచండ ప్రధానిగా కొనసాగుతారని నేపాల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రచండ తర్వాత సీపీఎన్-యూఎంఎల్ పార్టీ అధికారం చేపడుతుంది. అంటే మాజీ ప్రధాని ఓలీ మరోసారి ప్రధాని అవుతారన్నమాట. ఇదిలా ఉండగా, ఆదివారం నాటు అధికార మావోయిస్టు కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు ప్రచండ నిరాకరించారు. కూటమిని విడిచిపెట్టిన విషయాన్ని నేపాల్ కాంగ్రెస్ సీనియర్ నేత రామచంద్ర పాడెల్ ధ్రువీకరించారు. నేపాల్ రాష్ట్రపతి సూచించినట్లుగా ఆదివారంలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీలు చర్యలు తీసుకోని పక్షంలో అతి పెద్ద పార్టీ నాయకుడిని ప్రధానిగా రాష్ట్రపతి నియమించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం నెల రోజుల్లోగా తమ మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెజార్టీ నిరూపించుకోని పక్షంలో తిరిగి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.