Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు క్రిస్మస్ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడే మీడియాతో మాట్లాడుతున్న తరుణంలో వైకాపా నేతలు పెట్రోల్ సంచులతో దాడికి దిగారు. వైకాపా నేత మేరుగుమాల కాళీ తెదేపా నేత రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి సోమవారం వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ అసభ్య పదజాలంతో దూషించారని తెదేపా నేతలు తెలిపారు.
దీంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘర్షణను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా వైకాపా నేతలు దాడి చేశారు. వంగవీటి రంగా వర్థంతిని గుడివాడలో ఎలా నిర్వహిస్తారో చూస్తామంటూ వైకాపా నేతలు సవాల్ విసిరారు. రావి నాయకత్వంలో వర్ధంతి కార్యక్రమాలు చేస్తాం దమ్ముంటే అడ్డుకోవాలని నాని అనుచరులకు తెదేపా శ్రేణులు సవాల్ విసిరారు. క్రమ క్రమంగా తెదేపా కార్యాలయానికి ఆ పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. రావి వెంకటేశ్వరరావును దూషించిన వైకాపా నేత ఇంటికి వెళ్లేందుకు తెదేపా శ్రేణులు సమాయత్తం కావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, తెదేపా కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.