Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విమాన ప్రయాణికుల్ని బెదిరించి, వారి వద్ద నుంచి బంగారం వసూల్ చేసిన ఇద్దరు పోలీసు హెడ్ కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ టర్మినల్ 3 వద్ద ఇద్దరు ప్రయాణికుల్ని బెదిరించిన పోలీసులు వారి నుంచి 50 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాబిన్ సింగ్, గౌరవ్ కుమార్ అనే ఇద్దరు పోలీసులు టర్మినల్ 3 వద్ద సెక్యూర్టీ గార్డులుగా చేస్తున్నారు. అయితే దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికుల్ని వాళ్లు టార్గెట్ చేసేవాళ్లు. ప్యాసింజర్ల వద్ద ఉన్న బంగారు ఆభరణాలను ఆ పోలీసులు బెదిరించి తీసుకున్నారు. అయితే ఆ ఇద్దరు పోలీసుల నుంచి సుమారు 51 లక్షల విలువైన బంగారాన్ని రికవర్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సలావుద్దీన్ కతా అనే వ్యక్తి నుంచి సుమారు 600 గ్రాముల బంగారాన్ని, షేక్ ఖాదర్ బాషి నుంచి మరో 400 గ్రాముల బంగారాన్ని ఆ పోలీసులు లాక్కున్నట్లు ఫిర్యాదులో తేలింది. బెదిరింపులకు పాల్పడిన పోలీసుల్ని గుర్తించి విచారణ చేపట్టారు. ఆ తర్వాత వాళ్లను అరెస్టు చేశారు.