Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రపతి ముర్ము రేపు ములుగు జిల్లాలోని యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ తరుణంలో రామప్ప దేవాలయం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి అలజడి జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు ప్రత్యేక హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. రాష్ట్రపతి ప్రత్యేక భద్రతా సిబ్బంది, ఎన్ఎస్జీ బృందం ఏర్పాట్లను పర్యవేక్షించింది. నేడు, రేపు రామప్పను దర్శించుకునేందుకు సాధారణ భక్తులను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప ఆలయ సందర్శన దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు.
రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రపతి రామప్పను దర్శించుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును ఆమె ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గిరిజన కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.