Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఘనత సాధించాడు. తన కెరీర్లో ఓపెనర్‌గా మొత్తం 45 సెంచరీలు చేశాడు. అందులో వన్డేల్లో 20, టెస్టుల్లో 25 శతకాలు ఉన్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీ బాదాడు. ఇదే అతడికి వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ రికార్డుని సమం చేశాడు. సచిన్ తన 100 సెంచరీలలో 45 శతకాలు ఓపెనర్‌గానే సాధించాడు. ఇప్పుడు సచిన్‌తో వార్నర్ సమంగా నిలిచాడు. గత మూడేళ్లలో టీ20లు, వన్డేల్లో రాణించిన డేవిడ్ వార్నర్ టెస్టుల్లో మాత్రం సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న వార్నర్ మంగళవారం తన డబుల్ సెంచరీతో సమాధానం చెప్పాడు. అలాగే వందో టెస్టులో సెంచరీ సాధించిన 10 మంది ఆటగాళ్ల సరసన చేరాడు. రికీ పాంటింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియన్. అలాగే వందో టెస్టు మ్యాచ్‌లో ద్విశతకం సాధించిన రెండో బ్యాటర్‌గా అవతరించాడు. ఇంతకుముందు ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ ఇలానే డబుల్ సెంచరీ బాదాడు.
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న అంతర్జాతీయ క్రికెటర్లలో అత్యధిక శతకాలు సాధించిన రెండో బ్యాటర్ డేవిడ్ వార్నర్ కావడం విశేషం. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 72 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి తర్వాత ఇంగ్లాండ్ ఆటగాడు జోరూట్ (44), రోహిత్ శర్మ (41), స్టీవ్ స్మిత్ (41) ఉన్నారు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా 386/3 స్కోరు చేసింది. డబుల్ సెంచరీ అనంతరం కాలికి గాయంతో డేవిడ్ వార్నర్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ట్రావిస్ హెడ్ (48*), అలెక్స్ క్యారీ (9*) ఉన్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌటైంది.