Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో ఫార్మాసిటీ లారస్ ల్యాబ్ పరిశ్రమలో సోమవారం రాత్రి సంభవించిన ప్రమాదంలో మృతులు నలుగురికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగినా తక్షణమే చర్యలు తీసుకున్నామన్నారు. బహుళ జాతి కంపెనీలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో బ్రాండిక్స్ లాంటి పరిశ్రమల్లో ప్రమాదం జరిగినప్పుడు సైతం అప్రమత్తంగా వ్యవహరించామన్నారు.
ఈ ప్రమాదంలో మృతులు బి. రాంబాబు, రాజేష్‌బాబు, రాపేటి రామకృష్ణ, మజ్జి వెంకట్రావు మృతదేహాలకు కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వారి బంధువులకు అప్పగించినట్లు పరవాడ సీఐ పి.ఈశ్వరరావు తెలిపారు.
అంతే కాకుండా ఈ దుర్ఘటనలో మరణించిన నలుగురు కార్మికులకుటుంబాలకు రూ.2.24 కోట్ల పరిహారం చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించిందని సీఐటీయూ నాయకులు గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. విశాఖ కేజీహెచ్‌లో ఇరువర్గాల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరిందన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన పర్మినెంట్ ఉద్యోగులు ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.70 లక్షలు చొప్పున రూ.1.40 కోట్లు, అలాగే.. కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.42 లక్షల చొప్పున రూ.84 లక్షలు పరిహారం ఇవ్వడంతోపాటు బాధిత కుటుంబంలో ఒకరికి పరిశ్రమలో ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు.