Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోకి సంబంధించిన కంటెంట్ ను ఆన్ లైన్ లో అనధికారికంగా ప్రసారం చేస్తున్నారని, ఇది షోపై ప్రభావం చూపుతోందని అర్హ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు అన్ స్టాపబుల్ టాక్ షో కంటెంట్ ను అనధికారికంగా ప్రసారం చేయడంపై కీలక ఆదేశాలు ఇచ్చింది. అనధికార ప్రసారాలు నిలుపుదల చేయాలంటూ ఇంజంక్షన్ ఆర్డర్స్ ఇచ్చింది. ఇటీవల అన్ స్టాపబుల్ ప్రోమోలు, ఎపిసోడ్ లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఓవైపు ఎపిసోడ్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే దానికి సంబంధించిన కంటెంట్ (ఫొటోలు, వీడియోలు) ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోంది. అర్హ మీడియా సంస్థ వీటన్నింటిని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇలాంటి పరిణామాలతో ఆర్థికంగా తాము నష్టపోతున్నామని తెలిపింది. వాదనలు విన్నపిమ్మట... ఇంజంక్షన్ ఆర్డర్స్ ఇవ్వకపోతే పిటిషనర్ కు తీవ్ర నష్టం కలుగుతుందని, అందుకే మధ్యంతర ఇంజంక్షన్ ఆర్డర్స్ ఇస్తున్నామని జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు, కేంద్రానికి, ఇంటర్నెట్ సేవల సంస్థలకు కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అన్ స్టాపబుల్ టాక్ షోకి సంబంధించి ఆన్ లైన్ లోనూ, సోషల్ మీడియాలోనూ అనధికారికంగా ఉన్న కంటెంట్ కు సంబంధించి లింకులు తొలగించాలని స్పష్టం చేసింది.