Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: తిరుమలలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం ఆరునెలల పాటు శ్రీవారి దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆవాస్తవమని ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు తెలిపారు. టీటీడీ ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు.
ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు మార్చి ఒకటవ తేదీ ముహూర్తంగా నిర్ణయించగా ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహిస్తారని తెలిపారు. గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు(కొయ్య) శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహంలోకి ప్రవేశపెడతారని వివరించారు. ఆ తర్వాత ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతారని తెలిపారు. ఇందుకోసం పట్టే ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యథావిధిగా దర్శించుకోవచ్చని అన్నారు.