Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎం జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. నర్సీపట్నం మండలం జోగునాథునిపాలెంలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ తరుణంలో ఆయన ఇటీవల కందుకూరులో చంద్రబాబు సభలో జరిగిన ఘటనపై స్పందించారు. డ్రోన్ షాట్ల కోసం కందుకూరు సభ ఏర్పాటు చేసి ఎనిమిది మందిని బలిచేశారని విమర్శించారు. ఫొటో షూట్ కోసం ఘోరానికి పాల్పడ్డారని మండిపడ్డారు. గతంలో గోదావరి పుష్కరాల్లోనూ ఇలాగే 29 మంది చనిపోవడానికి కారకులయ్యారని ఆరోపించారు.
చంద్రబాబుది పబ్లిసిటీ పిచ్చి అని, జనం రాకపోయినా, జనం బాగా వచ్చారని చూపించడం కోసం కందుకూరులో ఇరుకు రోడ్డులో సభ ఏర్పాటు చేశారని సీఎం జగన్ విమర్శించారు. రాజకీయం అంటే డైలాగులు, షూటింగులు కాదని, రాజకీయం అంటే డ్రోన్ షాట్లు కాదని, రాజకీయం అంటే డ్రామాలు అసలే కాదని అన్నారు. 73 ఏళ్ల ముసలాయన అంటూ వ్యంగ్యం ప్రదర్శించిన సీఎం జగన్ ఆయనను చూస్తే వెన్నుపోటు, మోసాలు అనే రెండు అంశాలే గుర్తొస్తాయన్నారు.