Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆ యువతీ యువకులిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని ఆనందంగా జీవించాలని కలలు కన్నారు. కానీ, కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆ యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఫేస్బుక్లో లైవ్‌స్ట్రీమ్ పెట్టి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అస్సాంలో సోమవారం చోటు చేసుకుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించకపోవడం గమనార్హం. మరోవైపు మృతికి యువతి కుటుంబసభ్యులే కారణమని యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు. అస్సాంలోని కలాయిన్కు చెందిన జయ్‌దీప్ మెడికల్ సేల్స్ ప్రొఫెషనల్‌గా పని చేస్తున్నాడు. సిల్చార్‌లో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. అదే గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 'నేను ఆమెను ఎంతగానో ప్రేమించా. అదే విషయాన్ని చెప్పి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాను. కానీ, అందరిముందు నన్ను తిరస్కరించింది. ఆ తర్వాత వాళ్ల అంకుల్ వచ్చి.. మీ ఇద్దరి మధ్య సంబంధం కొనసాగితే.. ఆమెను చంపేస్తామని బెదిరించాడు. అందుకే చనిపోతున్నా.. నా వల్ల ఆమె బాధపడకూడదు. అమ్మా నన్ను క్షమించు. అంకుల్, ఆంటీ, అక్క, తమ్ముడు, బావ.. మీ అందర్నీ ఎంతగానో ప్రేమించాను. కానీ, నా గర్ల్ఫ్రండ్ని అంతకు మించి ప్రేమించా. ఆమె లేకుండా నేను బతకలేను. అందుకే ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నా' అంటూ ఆత్మహత్యకు ముందు లైవ్ వీడియోలో జయ్‌దీప్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. జయ్‌దీప్ మరణించాడన్న వార్తతో కుటుంబం మొత్తం షాక్‌కు గురయ్యామని అతని తమ్ముడు రూపమ్రే తెలిపాడు. అందుకే పోలీసులకు కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని అన్నాడు. యువతి కుటుంబసభ్యుల ఒత్తిడితోనే తన సోదరుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసు అధికారి నుమల్ మహంతా వెల్లడించారు. కానీ, మౌఖిక సమాచారం మేరకు ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించామన్నారు.