Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గంగాధర :
కరీంనగర్ జిల్లాలో గంగాధర మండల కేంద్రంలో వింత వ్యాధితో ఒకే కుటుంబానికి చెందిన తల్లీ, ఇద్దరు చిన్నారులు ఇప్పటికే మృత్యువాత పడగా, తెల్లవారుజామున కుటుంబ పెద్ద వేముల శ్రీకాంత్ మృతి చెందాడు. దీంతో ఓ కుటుంబమే అంతమైన తీరు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే గంగాధర మండల కేంద్రానికి చెందిన వేముల శ్రీకాంత్ , అతని భార్య మమతతో కలిసి కుమారై అమూల్య, కుమారుడు అధ్వైత్ ఎంతో అన్యోన్యంగా జీవించారు. ఓ ప్రయివేట్ కళాశాల లెక్చరర్ గా పని చేస్తూ శ్రీకాంత్ కుటుంబాన్ని పోషించగా, ఎటువంటి బాధరబందీ లేకుండా బతికారు. ఎంతో హాయిగా జీవించిన కుటుంబంపై అంతు చిక్కని వింత వ్యాధి కన్నెర్ర చేసింది. దీంతో కేవలం 45 రోజుల వ్యవధిలో కుంటుంబమే అంతమైంది. తొలుత శ్రీకాంత్ కుమారుడు అద్వైత్ వాంతులు, విరేచనాల భారిన పడి 20 నెలల బాలుడు నవంబర్ 16 వ తేదీన మృతి చెందాడు. అవే లక్షణాలతో నవంబర్ 29 న అతని కూతురు, 5 ఏళ్ల చిన్నారి అమూల్య మరణించింది. ఆ తర్వాత చిన్నారుల కర్మకాండలు పూర్తి చేసుకుని ధర్మపురి గంగ స్నానం చేసి ఇంటికి చేరిన శ్రీకాంత్ భార్య వేముల మమత అవే లక్షణాలతో అనారోగ్యం భారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 18 వ తేదీన తుది శ్వాస వదిలింది.ప
అంతు చిక్కని వింత వ్యాధితో ఒకరి తర్వాత ఒకరు ఒకే కుటుంబంలో తల్లీ, బిడ్డ, కొడుకు మృత్యవాత పడడం ఆ కుటుంబంలో పెను విషాదం నింపగా, గ్రామంలోనూ విషాదం అలముకుంది. రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిన మృత్యు ఘంటికలు మెాగిన ఘటన ప్రజలు మరవక ముందే ఆ కుటుంబ పెద్ద, ఓ ప్రయివేట్ కళాశాల లెక్చరర్ వేముల శ్రీకాంత్ తన భార్య మమత కర్మకాండలు పూర్తి కాకుండా శుక్రవారం రాత్రి వాంతులు, విరేచనాలతో రక్తం కక్కుకోగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీకాంత్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున కన్ను మూశాడు. కేవలం 45 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. మరణాలకు అసలు కారణాలేంటో తెలియక జనం ఆందోళన చెందుతుంటే, మృతుల రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపిన పరీక్షల్లోనూ వ్యాధి నిర్దారణ కాక వైద్యులు ఏం తేల్చలేక పోతున్నారు. వైద్యులకే సవాల్ విసురుతున్న ఈ దిగ్బ్రాందికరమైన ఘటనపై అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు.