Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ:
‘భారత్ జోడో యాత్ర’ నుంచి విరామం తీసుకున్న రాహుల్ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏ కారణం లేకపోవడంతో ‘భద్రతా ఉల్లంఘన’ పేరుతో తనపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘భారత్ జోడోను నేను కేవలం యాత్రగానే ప్రారంభించా. కానీ, ఇది ప్రజల గొంతుక అవుతుందని ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. వారు ఎంతగా మమ్మల్ని టార్గెట్ చేస్తే.. మేం అంతగా దృఢంగా మారుతాం. వారు మరింత దూకుడుగా మాపై విమర్శలు సాగించాలని కోరుకుంటున్నా. వారిని నేను గురువులుగా భావిస్తున్నా. వారిని చూసి నేను ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నా’’ అని రాహుల్ ఎద్దేవా చేశారు.
‘‘బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లాలని కేంద్ర హోంశాఖ చెబుతోంది. అదేలా సాధ్యం? యాత్రలో నేను కాలినడకనే వెళ్లాలి. అప్పుడు కూడా భద్రత ఎలా ఇవ్వాలో వారికి తెలుసు. కావాలనే నా యాత్రను రాద్దాంతం చేస్తున్నారు. ఏ కారణం లేకపోవడంతో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ నాపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి యాత్రలు చేసినప్పుడు ఎలా భద్రత ఇస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. ఇప్పటివరకు భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగిందని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు కొత్త మార్గంలో ఎలా ఆలోచించాలో చెప్పేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.