Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయ్‌పూర్
ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్ధామ్ జిల్లాలో సింఘన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్‌గావ్ గ్రామంలో అక్రమంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసేందుకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది గురువారం అక్కడకు వెళ్లారు. ఈ తరుణంలో గ్రామస్తులు పోలీసులపై ప్రతిఘటించి ఎదురుదాడి చేశారు. దీంతో పలువురు పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది గాయపడ్డారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు రెచ్చిపోయారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందిపై కర్రలతో దాడులు చేశారు. ఊహించని ఈ సంఘటనకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది షాక్ అయ్యారు. కొందరు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. గ్రామస్తుల దాడిలో పలువురు గాయపడ్డారు. వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, నాటుసారా తయారీపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా ఈ సంఘటన జరిగింది. నాటు సారా తయారీని అడ్డుకుని వాటిని ధ్వంసం చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం చెందారు. ఈ దాడిలో పాల్గొన్న 15 మందికిపైగా గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.