Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కురవి వద్ద జాతీయ రహదారిపై ఆటోపై గ్రానైట్ లారీపై నుంచి బండరాళ్లపడిపోయాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దీనిలో మృతులను మంగోరిగూడెంకు చెందిన వారిగా గుర్తించారు. స్థానికులు సమాచారం ప్రకారం లారీ గ్రానైట్ లోడ్‌తో వెళ్తుండగా వాటికి కట్టిన తాళ్లు ఊడిపోయి పక్క నుంచి వెళ్తున్న ఆటోపై పడిపోయాయని తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలు ఏడుగురు వ్యక్తులు ఉండగా ముగ్గురు వ్యక్తులు ఆటోలో చిక్కుకొని మృతి చెందారు.
భారీ బండరాళ్లు కావడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి కాళ్లు, చేతులు విరిగాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, మితిమీరిన వేగం, సరిగా రాళ్లను కట్టకపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. లారీ మహబూబాబాద్ నుంచి మరిపెడ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. గాయపడ్డ నలుగురికి మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.