Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమరావతి
పేదలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీలో నకిలీనోట్లు పంపిణీ కలకలం సృష్టిస్తోంది. ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెం గ్రామంలో 38 రూ. 500
నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి పెంచిన పింఛన్లను ఆదివారం
నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి శ్రీకారం చుట్టింది.
ఈ తరుణంలో నరసాయపాలెం గ్రామం ఎస్సీ కాలనీలో వాలంటీర్ పింఛన్లు పంపిణీ చేసేందుకు గాను శనివారం యర్రగొండపాలెం బ్యాంకులో డబ్బును డ్రా చేశాడు. ఆదివారం ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వెళ్లిన తర్వాత నకిలీ నోట్లుగా గుర్తించిన లబ్ధిదారులు వాలంటీర్ దృష్టికి తీసుకువచ్చారు. వాలంటీర్ తన వద్ద ఉన్న మరిన్ని నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించడంతో పంపిణీ అయిన మొత్తం రూ. 19వేలు నకిలీ రూ. 500 నకిలీ నోట్లు తిరిగి స్వాధీనం చేసుకున్న వాలంటీర్ అధికారులకు అప్పగించారు. నకిలీ నోట్లు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునన్నారు.