Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇవాళ గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ సభ జరగడం తెలిసిందే. అయితే, చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత అపశృతి చోటుచేసుకుంది. కానుకలు తీసుకునేందుకు జనం భారీగా తరలివచ్చారు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట చేసుకోవడంతో ఒక మహిళ మృతి చెందింది. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి, మరో ఇద్దరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, మృతురాలిని ఏటీ అగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవిగా గుర్తించారు. ఇవాళ గుంటూరు వికాస్ నగర్ లో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రసంగం కొనసాగినంత సేపు సజావుగానే ఉన్న సభ, ఆయన వెళ్లిపోయిన తర్వాత అదుపుతప్పింది. కార్యక్రమ నిర్వాహకులు, టీడీపీ నేతలు పరిస్థితిని నియంత్రించలేకపోయారు. మహిళ మృతి చెందిన నేపథ్యంలో, నిర్వాహకులు చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు.