Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఢిల్లీ శివార్లలోని సుల్తాన్‌పురి ఏరియాలో ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న 20 ఏండ్ల యువతిని ఢీకొన్న ఓ కారు ఆమెను దాదాపు 20 కిలోమీటర్ల దూరం అలాగే ఈడ్చుకుపోవడంతో ఆమె మృతిచెందింది. దాంతో మృతురాలి శరీరం ఛిద్రమైంది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాలలోకి వెళ్లితే... ‘ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలు సమయంలో నేను ఉన్న ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో ఒక వాహనం వద్ద చప్పుడు వినిపించింది. అదేదో టైర్ పేలిందనుకున్నా. కానీ, వెంటనే ఒక కారు మహిళ శరీరాన్ని ఈడ్చుకుపోవడం కనిపించింది. చాలా భయమేసింది. వెంటనే తేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాను. కొద్దిసేపటికే కారు యూటర్న్ తీసుకుంది. అప్పటికీ మృతదేహం కారు చక్రాల వద్ద చిక్కుకునే ఉంది. కారు అనేకసార్లు యూటర్న్లు తీసుకుంది. గంటన్నరపాటు.. దాదాపు 20 కిలోమీటర్లు ఆ మృతదేహాన్ని ఈడ్చుకెళ్లారు. వారిని ఆపేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా వీలుకాలేదు. ఆ తర్వాత కంజావాలా రోడ్డులో జ్యోతి గ్రామం వద్ద మృతదేహం కిందపడింది. అది కేవలం ప్రమాదం మాత్రమే కాకపోవచ్చు’ అని ప్రత్యక్షసాక్షి దీపక్ దహియా మీడియాకు వెల్లడించారు.
ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ వచ్చింది. రోహిణిలోని కంజావాలా నుంచి కుతూబ్‌గఢ్ వైపు వెళ్తోన్న ఓ కారు.. మహిళను ఈడ్చుకెళ్తున్నట్లు సమాచారం అందింది. కారు నంబరు కూడా చెప్పడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. మార్గమధ్యలో ఉన్న చెక్‌పోస్టులను అలర్ట్ చేశారు. అంతలోనే రోడ్డుపై ఓ మహిళ మృతదేహం పడిఉందంటూ కొద్దిసేపటికి కంజావాలా పోలీసులకు మరో కాల్ వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం.. ఘటనా స్థలం నుంచి నమూనాలను సేకరించింది. కారు నంబరు ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు.. అందులో ప్రయాణించిన ఐదుగురిని అరెస్టు చేశారు.