Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
పట్టణ మహిళా సంఘాల సభ్యులకు ఉపాధే లక్ష్యంగా చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీ యూనిట్లను నెలకొల్పాలని మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (మెప్మా) నిర్ణయించింది. కరోనా తర్వాత చిరుధాన్యాలకు ఆదరణ పెరుగడం, 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు చిరుధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తులను తినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీపై అవగాహన, చైతన్యం, అవసరమైన శిక్షణ ఇప్పించడం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడుతాయనే ఉద్దేశంతో మెప్మా ప్రతి జిల్లాలో కనీసం ఒక మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ప్రతి పట్టణంలో కనీసం ఐదు రకాల ఉత్పత్తులను విక్రయించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. మహిళా సంఘాలకు ఇందుకు అవసరమైన రుణాన్ని బ్యాంకుల ద్వారా ఇప్పించనున్నారు. అంతే కాకుండా కొత్తవారికి రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ (ఐఐఎంఆర్) లో అవసరమైన శిక్షణ ఇప్పించనున్నారు. ప్రతి జిల్లాలో మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి, కనీసం పరిజ్ఞానం ఉన్న వారిని వెంటనే ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.