Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
భారత రాష్ట్ర సమితి పార్టీ అనతికాలంలోనే వివిధ రాష్ట్రల్లోకి విస్తరించేందుకు కృషి చేస్తుంది. ఈ తరుణంలోనే మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్ నేత తోట చంద్రశేఖర్‌ను బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా నియమించనున్నట్లు, ఆయనతోపాటు ఏపీ మాజీ మంత్రి, మాజీ ఐఆర్టీఎస్ అధికారి రావెల కిశోర్‌బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టీజే ప్రకాశ్‌లతో పాటు పలువురు సోమవారం భారాస పార్టీలో చేరనున్నారు. తెలంగాణభవన్‌లో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
బీ ఆర్ ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీ అధిష్ఠానం ఏపీ సహా వివిధ రాష్ట్రాల నాయకులతో చర్చలు జరుపుతోంది. ఈ తరుణంలో చంద్రశేఖర్, కిశోర్‌బాబు, పార్థసారథి తదితరులు పార్టీలో చేరేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్‌గా 23 ఏళ్లపాటు పనిచేసిన చంద్రశేఖర్ ఆ పదవికి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైకాపా అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి, 2019లో జనసేన పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. ఏపీలోని బలమైన సామాజికవర్గానికి చెందిన ఆయనను పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షునిగా అధినేత కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
రావెల కిశోర్‌బాబు 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున విజయం సాధించి, చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమమంత్రిగా పనిచేశారు. 2019లో ఆయన జనసేన పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత భాజపాలో చేరినా, దానికీ రాజీనామా చేశారు. చింతల పార్థసారథి ఐఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి 2019లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతపురం జిల్లాకు చెందిన తుమ్మలశెట్టి జయప్రకాశ్ నారాయణ (టీజే ప్రకాశ్) 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున అనంతపురం నగర నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. వీరితోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్లోకి చేరనున్నారు.