Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ
మెక్సికో సరిహద్దు నగరమైన జువారెజ్‌లో ఉన్న సెంట్రల్ జైలుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 14 మంది అక్కడికక్కడే మరణించారు. వారిలో 10 మంది భద్రతా సిబ్బంది, నలుగురు ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు.
ఎస్‌యూవీల్లో వచ్చిన దుండగులు ఒక్కసారిగా జైలు సెక్కూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారని, జైలులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం, స్థానిక పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని అన్నారు. దుండగుల కాల్పుల్లో భద్రతా సిబ్బందితోపాటు నలుగురు ఖైదీలు చనిపోయారని, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ తరుణంలో 24 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోను ఉందన్నారు.