Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒక యువతిని యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 19 ఏళ్ల లయస్మిత బెంగళూరు రూరల్ ప్రాంతంలో ఉన్న కాలేజీలో చదువుతున్నది. పవన్ కల్యాణ్ అనే విద్యార్థి మరో కాలేజీలో చదువుతున్నాడు. వీరిద్దరికి పరిచయం ఏర్పడటంతో తన ప్రేమను వ్యక్తం చేశాడు. అయితే మరో వ్యక్తిని ప్రేమిస్తున్న ఆ యువతి పవన్ కల్యాణ్ ప్రేమను నిరాకరించింది. ఈ నేపథ్యంలో లయస్మితపై ఆ యువకుడు కక్ష పెంచుకున్నాడు. కాగా, సోమవారం ఉదయం బెంగళూరు ప్రెసిడెన్సీ కాలేజీ వద్ద ఉన్న లయస్మిత వద్దకు పవన్ కల్యాణ్ వచ్చాడు. తన వెంట తెచ్చిన కత్తితో ఆమెను పొడిచాడు. ఆపై అదే కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి రక్తం మడుగుల్లో పడి అక్కడే చనిపోయింది. గాయపడిన పవన్ కల్యాణ్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లయస్మితను పవన్ కల్యాణ్ ఎందుకు హత్య చేశాడన్నది ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన ప్రెసిడెన్సీ కాలేజీలో కలకలం రేపింది.