Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ నెల 12న రణస్థలంలో యువశక్తి సభ జరగనుందని తెలిపారు. ఈ మేరకు యువశక్తి సభ వాల్ పోస్టర్ ను పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. స్వామి వివేకానంద జయంతి రోజున, ఆయన స్ఫూర్తితో జనసేన యువశక్తి కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. రాష్ట్రంలోని యువ గళం వినిపించేలా ఈ యువశక్తి సభ ఉంటుందని తెలిపారు. యువతీయువకులందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులేనని పవన్ పిలుపునిచ్చారు. భారతదేశానికి వెన్నెముక యువతేనని, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనదేనని అన్నారు. అయితే ఉత్తరాంధ్రలో యువత చదువులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు వలస వెళ్లే పరిస్థితి ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో, వలసలు, విద్యా, వ్యాపారాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై యువత తమ అభిప్రాయాలు తెలియజేసేలా ఈ యువశక్తి సభ ఉంటుందని పవన్ కల్యాణ్ వివరించారు. అయితే ఈ సభలో తాము మాట్లాడడం కాదని, యువత అభిప్రాయాలను వారి నోటి ద్వారానే వినే కార్యక్రమం చేబడుతున్నామని తెలిపారు. కాగా, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు పాల్గొన్నారు.