Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రష్యా దాడులను దీటుగా తిప్పికొడుతున్న ఉక్రెయిన్ తాజాగా మాస్కో ఆక్రమిత దొనెట్స్క్ ప్రాంతంపై విరుచుకుపడింది. ఇక్కడి మకివ్కా నగరంపై జరిపిన భీకర క్షిపణి దాడిలో.. 400 వరకు రష్యన్ సైనికులు మృతి చెందినట్లు వెల్లడించింది. మరో 300 మంది వరకు గాయపడినట్లు ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. మాస్కో సేనలు ఆశ్రయం పొందుతున్నట్లు భావించిన ఓ భవనంపై ఈ దాడి చేశామని, ఈ క్రమంలోనే వారికి భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు చెప్పింది. మరోవైపు.. రష్యా అనుకూల స్థానిక పాలనాయంత్రాంగం ఈ విషయాన్ని కొట్టిపారేసింది. దాడి, ప్రాణనష్టం వాస్తవమేనని.. అయితే ఆ స్థాయిలో మరణాలు లేవని తెలిపింది. నూతన ఏడాది మొదటి రోజు అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు దొనెట్స్క్లోని రష్యా అనుకూల సీనియర్ అధికారి డానిల్ బెజ్సోనోవ్ వెల్లడించారు. అమెరికా సరఫరా చేసిన ఎంఎల్ఆర్ఎస్ హిమార్స్ క్షిపణులతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు. అయితే, ఎంత మంది మృతి చెందారో తెలియాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతంపై దాదాపు 25 రాకెట్ దాడులు జరిగినట్లు చెప్పారు. మరోవైపు.. ఈ ఘటన అనంతరం ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యా.. డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడినట్లు స్థానిక గవర్నర్ ఒలెక్సీ కులేబా తెలిపారు. సోమవారం సైతం దాడులు జరిగే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరిస్తూ.. షెల్టర్లలో తలదాచుకోవాలని సూచించారు.