Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఒడిశాలో రష్యన్ల వరుస మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుల వ్యవధిలో ఇప్పటికే ఇద్దరు అనుమానాస్పదరీతిలో చనిపోగా.. తాజాగా మరొక రష్యన్ ప్రాణాలు కోల్పోయాడు. పారాదీప్ కు వెళుతున్న కార్గో షిప్ లో పనిచేస్తున్న రష్యన్ పౌరుడు సెర్గీ మిలియాకోవ్ మంగళవారం ఉదయం మరణించాడు. ఉన్నట్టుండి సెర్గీ మిలియాకోవ్ కుప్పకూలిపోయాడని, వైద్యం అందించేలోగా ప్రాణాలు విడిచాడని షిప్ సిబ్బంది వివరించారు. ప్రాథమిక వివరాల ఆధారంగా గుండెపోటు వల్లే మిలియాకోవ్ చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, పోస్ట్ మార్టం తర్వాతే మరణానికి అసలు కారణం బయటపడుతుందని వివరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడు, బిజినెస్ మ్యాన్ అయిన పావెల్ అనటోవ్ రాయగఢలోని ఓ హోటల్ లో అనుమానాస్పద రీతిలో ఇటీవల చనిపోయారు. పదిహేను రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన తర్వాత మూడు రోజుల వ్యవధిలో అదే హోటల్ లో మరొకరు చనిపోయారు.
ఆయనదీ అనుమానాస్పద మరణమే. పుతిన్ విమర్శకుడు పావెల్ అనటోవ్ కు మంచి స్నేహితుడేనని సమాచారం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్ విమర్శకులు అనుమానాస్పద రీతిలో చనిపోవడం పలు సందేహాలు రేకెత్తిస్తోంది. తాజాగా రష్యాకు చెందిన మరో పౌరుడు కూడా ఒడిశాలో చనిపోవడంతో సమగ్ర విచారణ జరిపించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.