Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఓ బాలుడు..తన తమ్ముడు, చెల్లితో కలిసి దాగుడుమూతలాట ఆడుకుంటుండగా పత్తిలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగింది. కన్నెపల్లికి చెందిన చెన్నూరి కైలాస్-రమా దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. నాలుగో తరగతి చదువుతున్న అభిషేక్ (10)తన తమ్ముడు, చెల్లితో కలిసి సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయానికి వ్యవసాయ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి రాలేదు. అభిషేక్ దాగుడుమూతల ఆట ఆడుకుందామని చెప్పాడు. తమ్ముడు, చెల్లికి దొరకకూడదని ఇంటిలో నిల్వ ఉంచిన పత్తిలో చిన్న రంధ్రం చేసుకొని అందులోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. ముందుగా తల పెట్టే సరికి కాళ్లు పైకి లేచిసరికి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. అదే సమయంలో ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు.. అపస్మారక స్థితిలో ఉన్న అభిషేక్‌ను కౌటాలలోని దవాఖానకు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులతో పాటు పిల్లల రోదనలు అక్కడున్న వారికి కంటతడి పెట్టించాయి.