Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢీల్లి
థియేటర్లలోకి బయట నుంచి తెచ్చుకునే ఆహారంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ జమ్మూకశ్మీర్ హైకోర్టు 2018లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం పైవిధంగా తీర్పునిచ్చింది. గతంలో జమ్మూకశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది.
ఈ తరుణంలో మల్టీప్లెక్స్, సినిమా హాళ్లలోకి బయట నుంచి తినుబండారాలు, కూల్ డ్రింక్స్ తీసుకురాకుండా నిషేధం విధేంచే హక్కు హాలు యజమానులకే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చిన్నారులు, పిల్లల కోసం ఆహారం తెచ్చుకునే తల్లిదండ్రులను అనుమతించాలని సూచించింది. అలాగే థియేటర్లలో ఉచితంగా తాగునీరు అందించాలని ఆదేశించింది. సినిమా హాలు ప్రయివేటు ఆస్తి కాబట్టి బయటి నుంచి తీసుకొచ్చే ఆహారాన్ని అనుమతించాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం థియేటర్ల యాజమాన్యాలకే ఉంటుందని ధర్మాసనం పేర్కొన్నది. అయితే థియేటర్ లోపల ఉన్న ఆహార పదార్థాలను కొనుగోలు చేసే విషయంలో ప్రేక్షకులను బలవంతం చేయకూడదన్నది.