Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం పీలే అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. బరువెక్కిన హృదయాలతో కుటుంబ సభ్యులు, అభిమానులు పీలేకు కడసారి వీడ్కోలు పలికారు. అంతకు ముందు విలా బెల్మిరో స్టేడియంలో పీలే భౌతికకాయాన్ని వేలమంది అభిమానులు, స్థానికులు సందర్శించి నివాళులర్పించారు. బ్రెజిల్ దేశాధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లలూ.. పీలే మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. పీలే అంతిమ యాత్రకు వేలాది మంది బ్రెజిల్ ప్రజలు తరలివచ్చి తమ అభిమాన ఆటగాడికి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. సాంటోస్ వీధుల గుండా పీలే అంతిమయాత్ర కొనసాగుతుండగా.. అభిమానులు ‘పీలే 10’ జెర్సీని ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
సాకర్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాడిగా గుర్తింపు పొందిన పీలే (82) డిసెంబర్ 30వ తేదీన అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. 21 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో మూడు ప్రపంచకప్‌లు బ్రెజిల్‌కు అందించిన పీలే.. 1363 మ్యాచ్‌లాడి 1281 గోల్స్ చేశారు. ప్రపంచంలో మరే ఆటగాడు ఇన్ని గోల్స్ సాధించలేదు. బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన పీలే.. అందులో 77 గోల్స్ నమోదు చేశారు. ఫిఫా ప్రపంచకప్‌ను మూడుసార్లు గెలిచిన జట్టులో ఉన్న ఏకైక ఆటగాడిగా చరిత్రకెక్కిన పీలే.. తానాడిన తొలి ప్రపంచకప్ (1958)లోనే ఆరు గోల్స్ కొట్టి అదరగొట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్న పీలేను.. 2000 సంవత్సరంలో ఫిఫా ‘శతాబ్దపు అత్యుత్తుమ ఆటగాడి’గా ప్రకటించింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన పీలే అసలు పేరు ఎడ్సన్ అరాంటెస్ డో నాసిమెంటో.